: మృగాళ్ల పనిబట్టిన యూపీ మహిళా పోలీస్ కానిస్టేబుల్!
ఉత్తరప్రదేశ్ లో అత్యాచార ఘటనలను ఇక ఎంతమాత్రం సహించేది లేదని చెబుతున్నారు, లక్నో మహిళా పోలీస్ కానిస్టేబుల్ సునీత. 23 ఏళ్ల సునీత, మృగాళ్ల బారి నుంచి ఓ యువతిని రక్షించారు. అదీ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత. సునీత అరెస్ట్ చేసిన వారిలో ఓ సబ్ ఇన్ స్పెక్టర్ కూడా ఉన్నాడు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి బయలుదేరిన సునీత, ఓ టీనేజ్ బాలికను బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వేధిస్తుండటం చూశారు. అడ్డుకుందామంటే సివిల్ డ్రెస్ లో ఉన్నారు. తాను పనిచేసే మహిళా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. వెనువెంటనే అక్కడికి అతి సమీపంలోని మహా నగర్ పోలీస్ స్టేషన్ కూ సమాచారమిచ్చారు. అయితే వారొచ్చేలోగానే పరిస్థితి విషమించేలానే ఉంది. అంతే, ఒక్కసారిగా అపరకాళిక అవతారం ఎత్తారు. నేరుగా నిందితులు కూర్చున్న బైక్ వద్దకెళ్లి బైక్ తాళాలు లాగేసే యత్నం చేశారు. దీంతో నిందితులు ఆమెపై దాడికి యత్నించారు. వారి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన సునీత, నిందితుల్లో ఇద్దరిపై ముష్టి ఘాతాలు కురిపించారు. వారి కాలర్లు పట్టేసి నిలువరించేశారు. ఈలోగా మూడో నిందితుడు బైక్ పై పరారయ్యాడు. ఆలోగా మహిళా పోలీస్ స్టేషన్ సీఐ దూబే, సిబ్బందితో సహా అక్కడికి చేరుకున్నారు. నిందితులిద్దరినీ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన నిందితుల్లో ఒకరిని రాష్ట్ర విజిలెన్స్ విభాగంలో ఎస్సై గా పనిచేస్తున్న దినేశ్ సింగ్ బిస్త్ గా గుర్తించారు. తాగిన మైకంలో స్నేహితులతో కలిసి అతడు టీనేజ్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. అతడిపై కేసు నమోదు చేయరాదని ఉన్నత స్థాయి నుంచి మహిళా పోలీస్ స్టేషన్ కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. అయితే తన స్టేషన్ లో పనిచేస్తున్న సునీత, అత్యంత ధైర్యసాహసాలతో పట్టుకున్న నిందితులను వదిలిపెట్టేది లేదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ దూబే కేసు నమోదు చేశారు. నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సునీతను అభినందించారు. పదోన్నతితో పాటు రాష్ట్రపతి గ్యాలెంట్రీ మెడల్ కు సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు.