: రాహుల్ ‘కోట’ రాజవంశంలో ఘర్షణ: పోలీసు కానిస్టేబుల్ మృతి


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథీ ఆదివారం అట్టుడికిపోయింది. అమేథీ రాజవంశంలో చోటుచేసుకున్న ఘర్షణలో ఓ కానిస్టేబుల్ మరణించగా, ఇద్దరు మీడియా సిబ్బందికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అమేథీ రాజవంశానికి చెందిన వారు. రాజవంశానికి చెందిన ఆస్తుల పంపకంలో ఆయనకు తన భార్య గరిమా సింగ్ తో విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇటీవలే గరిమా సింగ్ తన ముగ్గురు పిల్లలతో కలసి రాజ భవనంలో దిగిపోయారు. ఢిల్లీలో ఉంటున్న సంజయ్ సింగ్, ఈ వివాదాన్ని తేల్చుకునేందుకు ఆదివారం అమేథీ వస్తున్నారన్న సమాచారంతో గరిమా మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో పోలీసులపై వారు విరుచుకుపడ్డారు. ఆందోళనకారులను నిలువరించేందుకు యత్నించిన పోలీసులపై గరిమా మద్దతుదారులు కాల్పులకు దిగారు. దీంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించగా, ఇద్దరు మీడియా సిబ్బందికి గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రానికి కూడా అక్కడ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.

  • Loading...

More Telugu News