: రేపు ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల విభజన కోసం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించిన తుది జాబితా ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రాథమిక జాబితాపై కొందరు అధికారులు లేవనెత్తిన పలు అంశాలను పరిశీలించి తుది జాబితాను కమిటీ ఖరారు చేయనుంది. తుది జాబితా రూపకల్పన తర్వాత నివేదికను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం కోసం పంపనున్నారు. పది రోజుల్లోగా ఈ మొత్తం తతంగం పూర్తి కానునున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.