: సయీద్ అజ్మల్ కోసం పాక్ క్రికెట్ బోర్డు ఆరాటం
జట్టుకు అనేక విజయాలు అందించిన ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ను తిరిగి అంతర్జాతీయ యవనికపైకి తీసుకొచ్చేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఖర్చుకు వెనుకాడడంలేదు. బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధమంటూ అజ్మల్ పై ఐసీసీ నిషేధం విధించడం తెలిసిందే. దీంతో, అతడి బౌలింగ్ శైలిని సరిదిద్దే బాధ్యతలను పీసీబీ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ కు అప్పగించింది. ఇందుకోసం సక్లయిన్ కు నెలకు రూ.10 లక్షలు చెల్లించనుంది. అంతేగాకుండా, అజ్మల్ కు బయోమెకానిక్ టెస్టులకయ్యే ఖర్చులను కూడా బోర్డు భరించనుంది. వరల్డ్ కప్ నాటికి ఈ స్టార్ స్పిన్నర్ ను జాతీయ జట్టులోకి తీసుకురావాలని పీసీబీ భావిస్తోంది.