: మావోయిస్టుల మృతదేహాలపై రగడ
నిన్న ఛత్తీస్ గఢ్ లో భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలపై ఆందోళన నెలకొంది. భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో ఉన్న మృతదేహాలను తమకు చూపించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అయినా పోలీసులు అంగీకరించకపోవడంతో అక్కడే ఆందోళన చేస్తున్నారు. మరోవైపు వరంగల్ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా భద్రాచలం చేరుకున్నారు.
మృతదేహాలను చూపించకపోవడం బంధువుల హక్కులను కాలరాయడమేనని, హైకోర్టు ఉత్తర్వులను పోలీసులు పాటించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మృతదేహాలను ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాకు తరలిస్తామని ఖమ్మం జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్ చెప్పారు. మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా సరిహద్దులలో ఛత్తీస్ గఢ్ లోని కిష్టారం అడవులలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరగడం, అందులో 10 మంది మావోయిస్టులు మరణించడం తెలిసిందే.