: మెదక్, నందిగామల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
మెదక్ పార్లమెంట్, నందిగామ అసెంబ్లీలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్విరామంగా కొనసాగనుంది. గడచిన అన్ని రకాల ఎన్నికల్లో కంటే అధిక శాతం ఓటింగ్ నమోదయ్యేలా చర్యలు చేపట్టాలని రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా నిర్భయంగా ఓటేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 95 శాతం మంది ఓటర్లకు ఓటరు స్లిప్ లను పంపిణీ చేశామని, ఓటరు స్లిప్ అందని వారికోసం పోలింగ్ కేంద్రాల సమీపంలో స్లిప్ లను అందించే ఏర్పాట్లు చేశామని అన్నారు. ఓటరు స్లిప్ అందని వారు ఓటరు కార్డు, రేషన్ కార్డు తదితర 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకదానితో ఓటేసేందుకు వీలుందన్నారు. మెదక్ లోక్ సభ పరిధిలో 15,43,700 మంది ఓటర్ల కోసం 1,837 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్న ఆయన, 1,141 కేంద్రాల్లో పోలింగ్ ను లైవ్ వెబ్ కాస్టింగ్ చేయనున్నామన్నారు. మెదక్ లోక్ సభ సీటు కోసం మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. మరోవైపు నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ స్థానంలో మొత్తం 1,84,064 మంది ఓటర్ల కోసం 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 141 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.