: చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించకపోతే, టీఎస్ అసెంబ్లీ సమావేశాలు రచ్చరచ్చే!: ఎర్రబెల్లి


తెలంగాణ టీడీపీ నేతలు ఈరోజు సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఆయనను కలిసిన సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. వరంగల్ లో కేసీఆర్ మాట్లాడిన తీరు రాజ్యాంగ విరుద్ధమని ఎర్రబెల్లి అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా... వారిని తొక్కేయాలనుకునే కేసీఆర్ నైజం ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ఆగస్ట్ 15న గోల్కొండ ఖిల్లా మీద జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత కేసీఆర్ కు నిజాం బుద్ధులు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లు కేవలం కేసీఆర్ కుటుంబం గురించే వార్తలు ప్రసారం చేస్తున్నాయని టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్ లో చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పి... చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించకపోతే రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ రచ్చ చేస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ ప్రతీసారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి.... తెలంగాణ భాష ఇలాగే ఉంటుంది అని తప్పించుకుంటున్నాడని.... కానీ, వాస్తవంగా తెలంగాణలో ప్రజలు అలా మాట్లాడరని ఆయన అన్నారు. కేసీఆర్ మాట్లాడే భాషను తెలంగాణలో కట్టె తుపాకీ పట్టుకునే పిట్టల దొర మాత్రమే మాట్లాడతాడని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. కేసీఆర్ జోకర్ లాగా ప్రవర్తిస్తున్నాడని... అసలు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత కూడా ఆయనకు లేదని అన్నారు.

  • Loading...

More Telugu News