: కేసీఆర్ కు గుణపాఠం నేర్పండి: జవదేకర్
కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణలో అరాచక పాలనను తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేయరాదని కేసీఆర్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చొరవతోనే తెలంగాణ వచ్చిందని... అలాంటి బీజేపీకి ఓటు వేయరాదని చెప్పడం ఆయన నైజాన్ని తెలియజేస్తోందని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు పేదలను అగౌరవ పరిచేలా ఉన్నాయని విమర్శించారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా ఆయనకు బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. పరిస్థితికి తగ్గట్టు మాట మార్చడంలో కేసీఆర్ కు ఎవరూ సాటి రారని జవదేకర్ ఎద్దేవా చేశారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతారన్న విషయం కేసీఆర్ కు ముందే తెలుసని మండిపడ్డారు. అప్పుడు రాష్ట్రం ఏర్పడితే చాలని నంగనాచి కబుర్లు చెప్పిన కేసీఆర్... అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారని తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా దిగజారి రాజకీయాలు చేయడం తగదని సూచించారు. మెదక్ ఎన్నికలు కేసీఆర్ కు ఓ గుణపాఠం కావాలని అన్నారు. తమకు ఏపీ, తెలంగాణ రెండు కూడా రెండు కళ్లలాంటివని... రెండింటిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.