: తప్పిపోయిన రైలు... 17 రోజుల తర్వాత దొరికిందట!
నమ్మశక్యం కాకున్నా, ఈ విషయాన్ని నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే, ఈ విషయం చెప్పింది ఏ ఆకతాయో కాదు, సాక్షాత్తు రైల్వే శాఖ ఉన్నతాధికారులు మరి! బీహార్లోని హాజీపూర్ సమీపంలో ఆగస్టు 25 న ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన రైళ్లను దారి మళ్లించారు. ఈ క్రమంలో గోరఖ్ పూర్- ముజఫర్ నగర్ ప్యాసింజర్ తప్పిపోయింది. రైలు వేరే మార్గం గుండా వెళుతున్న విషయాన్ని గమనించిన ప్రయాణికులు వడివడిగా దిగేశారు. రైలు మాత్రం ఆగలేదు. చాలా దూరం వెళ్లిన తర్వాత కాని ఆ రైలు నిలవలేదు. తీరా చూస్తే, రైలు ఆగిన ప్రాంతం వేరే రైల్వే డివిజన్ పరిధికి చెందినది. దీంతో తెగ వెదికిన రైల్వే అధికారులకు ఆ రైలు జాడ కనిపించలేదు. తీరా 17వ రోజున సదరు రైలు, వేరే డివిజన్ కు చెందిన స్టేషన్ లో ఉందని తెలిసింది. దీంతో చిన్నగా అక్కడికి వెళ్లిన అధికారులు రైలును గుట్టుచప్పుడు కాకుండా తమ డివిజన్ కు తరలించారు. అయితే దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమస్తిపూర్ రైల్వే డివిజన్ డివిజనల్ మేనేజర్ చెప్పారు. తప్పిపోయిన రైలు డ్రైవర్ అందుబాటులోకి రాకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన వివరించారు.