: అంత డబ్బెక్కడిది... విదేశాల్లో ఆ బంగ్లా ఎక్కడి నుంచి వచ్చింది?: పాక్ ప్రధానిపై ఇమ్రాన్ ధ్వజం
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై విపక్ష తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. నవాజ్ షరీఫ్ అవినీతిపరుడని, అధికారం అడ్డుపెట్టుకుని విదేశాల్లో భారీ ఎత్తున ఆస్తులు సంపాదించారని ఆయన ఆరోపించారు. లండన్ లోని ఖరీదైన ప్రాంతంలో ఆస్తులు, యూరప్ లో 320 మిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. లండన్ లోని 800 మిలియన్ల హైడ్ పార్క్ ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందని ఆయన నిలదీశారు. తన కుమారుడు హుస్సేన్ నవాజ్ పేరిట నవాజ్ షరీఫ్ భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టారని ఇమ్రాన్ విమర్శించారు. నవాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీకి జవాబుదారీగా లేడని ఆయన స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని షరీఫ్ సోదరులు నాలుగు చక్కెర కర్మాగారాలు ప్రారంభించారని ఆయన కడిగి పారేశారు.