: ఎయిర్ సెల్ వాటాను మాక్సిస్ గ్రూప్ కు అమ్మాలని మారన్ ఒత్తిడి చేశారు: సీబీఐ
ఎయిర్ సెల్, మరో రెండు రెండు అనుబంధ సంస్థల్లో చెన్నైకు చెందిన సి.శివశంకరన్ అనే వ్యక్తికి చెందిన వాటాలను మలేషియన్ సంస్థ మాక్సిస్ గ్రూపుకు అమ్మాలని కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ ఒత్తిడి చేసినట్లు సీబీఐ పేర్కొంది. దాంతో, శివశంకరన్ తన మూడు సంస్థలను మలేషియా మాక్సిస్ కమ్యూనికేషన్ సంస్థకు అమ్మినట్లు తెలిపింది. ఈ మేరకు ఎయిర్ సెల్-మాక్సిస్ ఒప్పందం కేసులో భాగంగా న్యూఢిల్లీ ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో బాధితుడుగా ఉన్న అమ్మకందారుడు శివశంకరన్ కు వ్యాపారం చేసుకునేందుకు మారన్ కారణంగా అనుమతి లభించలేదని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.కె గోయెల్ కోర్టుకు వివరించారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.