: మోడీ కోసం అమెరికాలో 'హై-ఫై రిసెప్షన్'... రంగంలో 'మిస్ అమెరికా' నీనా దావులూరి
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనను ఒబామా సర్కారుతో పాటు, అక్కడి భారతీయ వర్గాలు కూడా ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నాయి. ఆయన కోసం అమెరికాలోని భారత వర్గాలు ఓ భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తుండడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రయోక్తలు (హోస్టులు) గా 'మిస్ అమెరికా 2014' నీనా దావులూరి, అమెరికాలో సుప్రసిద్ధ టీవీ యాంకర్ హరి శ్రీనివాసన్ (పీబీఎస్ చానల్) వ్యవహరిస్తారు. న్యూయార్క్ లోని సుప్రసిద్ధ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ఈ నెల 28న నిర్వహించే ఈ భారీ రిసెప్షన్ కు 20,000 మంది ఇండో-అమెరికన్లు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఏ దేశాధినేత కోసం కూడా ఇంతటి అపూర్వ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. దీనిపై ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (ఐఏసీఎఫ్) ప్రతినిధి ఆనంద్ షా మాట్లాడుతూ, ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత మాట్లాడితే వినాలని, ప్రపంచ మహోన్నత ప్రజాస్వామ్య దేశ ప్రజలు ఉత్సుకతతో ఉన్నారని తెలిపారు. కాగా, అమెరికా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఐఏసీఎఫ్ కు 400కి పైగా ఇండో-అమెరికన్ సంఘాలు మద్దతిస్తున్నాయి.