: 23 ఏళ్ల సర్వీసులో 24 బదిలీలు... సమర్థుడికి దక్కిన బహుమానం!


నిజాయతీపరుడికి, సమర్థుడికి మనదేశంలో దక్కే గౌరవం ఏపాటిదో తెలిపే ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రాజకీయ నాయకుల అండ లేకుంటే ప్రభుత్వోద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కడుతుందీ కథనం. వివరాల్లోకి వెళితే... యు.సహాయం (52) తమిళనాడులో సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. 23 ఏళ్ల సర్వీసులో ఆయన 24 సార్లు బదిలీ అయ్యారు. అంతేకాదు... కేవలం 48 గంటల వ్యవధిలో రెండుసార్లు బదిలీ అయిన చరిత్ర కూడా ఆయన సొంతం. అలాంటి అధికారిని తమిళనాడులో అక్రమ గ్రాఫైట్ తవ్వకాలపై దర్యాప్తు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. గత వారంలోనే ఆయనకు రెండుసార్లు ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టులు ఇచ్చారు. అతనిని సమర్ధుడిగా గుర్తించిన న్యాయస్థానం కో-ఆప్టెక్స్ కు అధినేతగా కూడా రెండేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. తమిళనాట సాగుతున్న గ్రాఫైట్ తవ్వకాలపై మద్రాసు హైకోర్టులో తాజాగా ఓ పిటిషన్ దాఖలైంది. మధురై కలెక్టర్గా ఉన్న సమయంలో ఈ స్కామును బయటపెట్టిన ఐఏఎస్ అధికారి సహాయంను ఎందుకు తరచుగా బదిలీ చేస్తున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గడిచిన 23 సంవత్సరాల్లో ఆయనకు 24 బదిలీలు ఎందుకు బహుమతిగా వచ్చాయని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. గత బుధవారం ఆయనను భారతీయ వైద్యం, హోమియోపతి కమిషనర్గా నియమించిన రెండు రోజులకే సైన్స్ సిటీ వైస్ చైర్మన్గా మార్చడం వెనుక కారణం అడిగింది. దానిపై ప్రభుత్వం న్యాయస్థానానికి ఏమీ చెప్పనప్పటికీ, రాష్ట్ర చేనేత మంత్రి ఎస్.గోకుల్ ఇందిరతో గొడవల వల్లే ఆయనను బదిలీలతో వేధిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. న్యాయస్థానం జోక్యంతో ఆయనకు న్యాయం జరుగుతుందని సమాచారం.

  • Loading...

More Telugu News