: ఆర్టీసీకి తక్షణం రూ.250 కోట్ల సాయం: మంత్రి శిద్ధా రాఘవరావు
ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు కృషి చేస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీకి తక్షణ సాయంగా రూ.250 కోట్లు విడుదల చేస్తున్నామని, వచ్చే ఆరు నెలల్లో ఆరువేల కొత్త బస్సులు కొంటున్నామని వెల్లడించారు. డీజిల్ రేట్లకు అనుగుణంగా ఛార్జీలు పెంచకపోవడంవల్లనే నష్టాలు వచ్చాయన్నారు. ఛార్జీలు పెంపు ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, పెంపుపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇక రద్దీ వేళల్లో ప్రైవేటు వాహనాలు ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే పర్మిట్ రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వం తీసుకున్న పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంపు నిర్ణయం ఆర్టీసీ కార్మికులకు వర్తించదన్న మంత్రి శిద్ధా... ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు.