: కేసీఆర్ కు 'రాయలసీమ కల్చర్' ఎలా అలవడిందో అర్థం కావడం లేదు: వీహెచ్
ప్రజాకవి కాళోజీ శతజయంతి నాడు కేసీఆర్ డిఫ్యూటీ ముఖ్యమంత్రి రాజయ్యను అవమానించేలా మాట్లాడడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు తప్పుబట్టారు. పదిమందిలో డిప్యూటీ ముఖ్యమంత్రి 'ఇజ్జత్ (గౌరవం)' తీసేలా మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు. మంత్రులకు ఏదైనా చెప్పాలనుకుంటే... ప్రైవేటుగా పిలిపించుకుని ముఖ్యమంత్రులు మాట్లాడుతుంటారని... కానీ ఇలా అందరి ముందు సాక్షాత్తూ డిప్యూటీ ముఖ్యమంత్రిని అవమానించేలా మాట్లాడటం కేసీఆర్ కే సాధ్యమని అన్నారు. బహిరంగ సభలో ఒక 'హరిజన్'ను అవమానించడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడని... ఇక నుంచైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఆయన హెచ్చరించారు. ఛానళ్లపై నిషేధం విధించి మూడు నెలలవుతున్నా కేసీఆర్ ఇంకా కయ్యానికి కాలుదువ్వడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ కల్చర్ లో తిట్టుకోవడం... కొట్టుకోవడం... మళ్లీ వెంటనే కలిసిపోవడం భాగమని... అయితే కేసీఆర్ కు 'రాయలసీమ కల్చర్' ఎలా అలవడిందో తనకు అర్థం కావడం లేదని చురక అంటించారు. మెదక్ ఉపఎన్నిక ప్రచారంలో క్రాంగ్రెస్ కు ఓటేస్తే మురికి కాలువకి ఓటేసినట్లేనని హరీష్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. దేశానికి స్వాతంత్యం తెచ్చిన కాంగ్రెస్ ను మురికి కాలువతో పోల్చడం టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శమని అన్నారు. కేసీఆర్ కూడా తన రాజకీయజీవితాన్ని కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభించాడన్న విషయాన్ని హరీష్ రావు గుర్తుపెట్టుకోవాలని వీహెచ్ సూచించారు.