: ఓయూలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ, నిరుద్యోగ జేఏసీపై అర్ధరాత్రి దాడి
ఓయూలో రెండు విద్యార్థి సంఘాల మధ్య అర్ధరాత్రి తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కొంతకాలం క్రితం ఓయూలో నిరుద్యోగ విద్యార్థులందరూ కలసి 'ఓయూ నిరుద్యోగ జేఏసీ'గా ఏర్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని నిరసిస్తూ... వీరు కొన్నాళ్లుగా ఓయూలో నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునివ్వడంతో పాటు ఓయూలో కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన టీఆర్ఎస్ వీ, వామపక్ష విద్యార్థి సంఘాలు పిడమర్తి రవి నాయకత్వంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థులపై అర్ధరాత్రి కర్రలు, రాళ్లతో దాడి చేశాయి. దీంతో పాటు ఓ పథకం ప్రకారం ఉస్మానియా హాస్టల్ లోని ఏ,బీ,సీ బ్లాకుల్లో ఉన్న నిరుద్యోగ జేఏసీ విద్యార్థుల రూంలకు కూడా నిప్పు అంటించారు. నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు వెంటనే అప్రమత్తమై ప్రతిదాడికి దిగారు. ఎటువంటి ప్రాణహాని జరగనప్పటికీ... కొంతమంది విద్యార్థులకు ఈ సంఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. వారి పుస్తకాలు, సామాన్లు, ఫర్నిచర్ పూర్తిగా తగలబడ్డాయి. ప్రస్తుతం ఉస్మానియాలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది.