: ఇంకా జలవిలయంలోనే జమ్మూకాశ్మీర్... కొనసాగుతున్న సహాయక చర్యలు
భారీగా కురిసిన వర్షాలకు నదులు పోటెత్తుతుండడంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వరద పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. దాదాపు ఆరు లక్షల మంది ముంపు ప్రాంతాల్లో చిక్కుకుంటే, ఇప్పటివరకు 75వేల మందిని రెస్క్యూ బృందం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. మరోవైపు, సైన్యం, వైమానిక దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షం తనపై రాజకీయాలు చేయడం సరికాదని, వర్షాలను తాను ఆపలేననీ అన్నారు. కాగా, ఈ సాయంత్రం కేంద్ర కేబినెట్ జమ్మూకాశ్మీర్ వరద పరిస్థితిపై సమీక్ష జరపనుంది.