: సామూహిక వివాహం చేసుకుంటే మరుగుదొడ్డి ఉచితం!


మనిషికి కనీస అవసరమైన మరుగుదొడ్డి లేక దేశంలో ఎందరో ఇబ్బంది పడుతుండడం తెలిసిందే. ప్రభుత్వం కూడా ఈ సమస్యను ఛాలెంజ్ గా తీసుకుని పలు చర్యలు చేపడుతోంది. కానీ, గుజరాత్ లోని ఓ జిల్లాలో ఈ సమస్యను అధిగమించేందుకు అక్కడివారే ఓ వినూత్న పంథాను ఎంచుకున్నారు. వల్లభిపూర్ పతిదార్ ప్రగతి మండల్ (వీపీపీఎం) సంస్థ తాము నిర్వహించే సామూహిక వివాహ కార్యక్రమంలో ఒక్కటై, తమ పెళ్ళిని రిజిస్టర్ చేసుకున్న వారికి ఓ మరుగుదొడ్డిని ఉచితంగా నిర్మించి ఇస్తోంది. భావ్ నగర్ జిల్లాలోని వల్లభిపూర్ లో లెవా పటేళ్లు ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నారు. తమ వర్గానికి చెందిన మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, పేద కుటుంబాలకు చెందిన వారికి పెళ్ళి ఖర్చులు తగ్గించేందుకు ఇలా సామూహిక వివాహాలను ప్రోత్సహిస్తున్నారు. తొలిసారి 2013లో వల్లభిపూర్ పతిదార్ ప్రగతి మండల్ (వీపీపీఎం) ప్రత్యేక చొరవ తీసుకుని సామూహిక వివాహాలు నిర్వహించడం ప్రారంభించింది. 2015 జనవరికల్లా దాదాపు వంద వివాహాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పెళ్లికి వీపీపీఎం దాదాపు రూ.50,000 వరకు ఖర్చు చేస్తుంది. వారి భోజనాల ఖర్చు, ప్రతి జంటకు గృహ వస్తువులు అందిస్తుంది. పెళ్లి జరిగిన ఏడాది తర్వాత మరుగుదొడ్డిని కల్పిస్తుంది. ఈ మేరకు వీపీపీఎం అధ్యక్షుడు దిలీప్ షేథా మాట్లాడుతూ, సామూహిక వివాహాలు చేసుకునేందుకు కమ్యూనిటీ సభ్యులను ప్రోత్సహించామని, దానివల్ల వారు అనవసరమైన ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని చెప్పారు. అంతేకాక మహిళకు సరయిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరుగుదొడ్డి ఆలోచన కూడ చేసినట్లు వివరించారు.

  • Loading...

More Telugu News