: అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదు: రేవంత్
అన్నం ఉడికిందా? లేదా? అనేది ఒక మెతుకును బట్టి అర్థం చేసుకోవచ్చని... అలాగే, రాబోయే నాలుగున్నరేళ్లలో కేసీఆర్ పాలన ఎలా ఉండనుందన్న విషయం ఆయన వందరోజుల పాలన బట్టి అర్థం చేసుకోవచ్చని టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వందరోజుల పాలన అధ్వానంగా ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం చేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిన కేసీఆర్ ... ఇప్పటి వరకు కనీసం ఆ పని మొదలుపెట్టలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరుల కుటుంబాలను ఇప్పటివరకు కనీసం గుర్తించలేదన్నారు. అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేస్తే... వారి త్యాగాల గురించి ప్రజల్లో, మీడియాలో చర్చ జరుగుతుందని... దీని వల్ల తన కీర్తి ప్రతిష్ఠలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.