: మాజీ బ్యూటీ క్వీన్ ను పెళ్ళాడనున్న టెన్నిస్ రారాణి
టెన్నిస్ క్రీడలో రారాణి అనదగ్గ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా (57). ఆమె సాధించిన విజయాలు అలాంటివి. కెరీర్ లో 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు, 31 మేజర్ డబుల్స్ టైటిళ్ళు ఖాతాలో వేసుకుంది. మిక్స్ డ్ డబుల్స్ లో 10 టైటిళ్ళు నెగ్గిన నవ్రతిలోవా... వింబుల్డన్ సింగిల్స్ విభాగంలో 12 సార్లు ఫైనల్ చేరుకుంది. టెన్నిస్ కోర్టులో ప్రదర్శన అలా ఉంచితే, వెలుపల నవ్రతిలోవా వైఖరి మీడియాలో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఎందుకంటే, ఆమె లెస్బియన్ కాబట్టి. మాజీ మిస్ యూఎస్ఎస్ఆర్, మిస్ యూనివర్స్ రన్నరప్ జూలియా లెమిగోవా (42)తో గత ఆరేళ్ళుగా సహజీవనం చేస్తోందీ టెన్నిస్ గ్రేట్. తన మనసు దోచిన రష్యా సుందరి లెమిగోవాతో ఇప్పుడు పెళ్ళికి సిద్ధమైంది. త్వరలోనే వివాహం చేసుకోవాలని వీరిద్దరూ నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని కోకోనట్ గ్రోవ్ లో నివాసముంటున్న ఈ జంట పెళ్ళి కోసం మయామి-డేడ్ వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఫ్లోరిడా రాష్ట్రంలో స్వలింగ సంపర్కుల వివాహాలను అనుమతించే ఏకైక కౌంటీ మయామీ-డేడ్. కాగా, లెమిగోవాకు ముందు నవ్రతిలోవా మరో బ్యూటీ క్వీన్ తో సహజీవనం చేసింది. ఏడేళ్ళు సాగిన అనంతరం 1991లో ఆ బంధం వీడిపోయింది.