: 'నగరం' ఘటనకు గెయిల్ తప్పిదాలే కారణం!
22 మంది మరణానికి దారి తీసిన ‘నగరం’ దుర్ఘటనకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) పొరపాట్లే కారణమని విచారణ కమిటీ నిగ్గుతేల్చింది. తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో గ్యాస్ లీకై, మంటలు చెలరేగిన ఘటనకు గెయిల్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా నిలుస్తోందని ఈ ఘటనపై విచారణ నిర్వహించిన చమురు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని కమిటీ తేల్చిచెప్పింది. వినియోగదారులకు డ్రై గ్యాస్ సరఫరా కోసం తాటిపాక-కొండపల్లి పైపు లైన్ ను ఏర్పాటు చేసిన గెయిల్, సదరు పైపుల నిర్వహణను గాలికొదిలేసిందని చెప్పింది. అత్యధిక పీడనంతో సహజవాయువు సరఫరా జరిగే ఈ పైప్ లైన్లలో కార్బన్ డై ఆక్సైడ్, నీరు, సల్ఫర్ తదితర పదార్ధాలు కూడా రవాణా అవుతుంటాయన్న విచారణ కమిటీ, వాటిని నిరోధించేందుకు గెయిల్ ఏమాత్రం చర్యలు చేపట్టలేదని తెలిపింది. సహజ వాయువు నుంచి నీరు, కార్బన్ డై ఆక్సైడ్ లను తొలగించేందుకు పైపు లైన్ ప్రారంభమయ్యే తాటిపాక వద్ద గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్ (జీడీయూ)ను ఏర్పాటు చేస్తామన్న గెయల్, ఆ తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయిందని పేర్కొంది. జీడీయూ ఏర్పాటు చేసి ఉంటే, అసలు గ్యాస్ లీకేజయ్యే ప్రమాదమే ఉత్పన్నమయ్యేది కాదని తెలిపింది. అంతేకాక పైప్ లైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన గెయిల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, అసలు తనిఖీ ఊసే ఎత్తలేదని కూడా విచారణ కమిటీ నిగ్గుతేల్చింది. కమిటీ నివేదికను స్వీకరించిన కేంద్రం తదుపరి చర్యలపై పరిశీలన జరుపుతోంది.