: అమెరికా ద్వంద్వనీతికి ఇదే తార్కాణం
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటూ ప్రపంచానికి రోజుకో నీతి వాక్యం చెప్పే పెద్దన్న అమెరికా ద్వంద్వనీతికి తార్కాణం ఈ ఘటన. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు ఆర్థిక, ఆయుధ సహాయం చేసిన దేశం అమెరికా. సిరియాలో తమ వ్యతిరేక ప్రభుత్వంపై తీవ్రవాదుల్ని ఉసిగొల్పుతున్న అమెరికా, ఇరాక్ కు వచ్చేసరికి ఐఎస్ఐఎస్ పై పోరాటం చేస్తోంది. ఇరాక్ లో గానీ, సిరియాలోగానీ... అమెరికన్ దొరికితే చాలు మేక తలను కోసినట్టు కోసేస్తున్నారు ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు. కుర్దు సాయుధులు ఇటీవల ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో అమెరికా తయారీ ఆయుధాలే అత్యధికంగా దర్శనమిచ్చాయి. దీంతో ఆ ఆయుధాలు అక్కడికెలా చేరాయన్న విషయాన్ని అమెరికా వేగులు ఆరాతీశారు. సిరియాలో ఉగ్రవాదులకు సహాయం చేసేందుకు అమెరికా చేరవేసిన ఆయుధాలే ఇరాక్ చేరినట్టు నిర్థారణ అయింది. 'కత్తితో యుద్ధం ఆరంభించిన వాడు కత్తికే బలవుతాడు' అన్న చందంగా, అరాచకాన్ని ప్రోత్సహించేందుకు సరఫరా చేసిన ఆయుధాలే ఇప్పుడు అమెరికా కొంపముంచుతున్నాయి. అమెరికా ద్వంద్వప్రమాణాలే మధ్య ఆసియా దేశాలకు శాపంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.