: ఉద్యోగాల సంక్షోభంపై వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్యోగాల సంక్షోభంపై వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక చేసింది. దానివల్ల ఆర్థిక వృద్ధి పునరుత్తేజంపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి మంత్రం లేదని పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఈరోజు జరిగిన జీ20 లేబర్, ఎంప్లాయిమెంట్ మినిస్టీరియల్ సమావేశంలో ఓ అధ్యయన నివేదికను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. 2030 కల్లా జనాభా మరింత విస్తరించనున్న నేపథ్యంలో 600 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా వరల్డ్ బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ నిగెల్ ట్వోస్ మాట్లాడుతూ, "ఉద్యోగాల సంక్షోభంపై చిన్నపాటి అనుమానం ఉన్నమాట మాత్రం వాస్తవమే" అన్నారు. "ఉద్యోగాల విషయంలో, ముఖ్యంగా నాణ్యతాపరమైన ఉద్యోగాల్లో కొరత ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అయితే, కలతపెట్టే విషయమేమిటంటే అనేక జి-20 దేశాల్లో వేతనం, ఆదాయంలో అసమానత ఉందని తెలిసింది. అయినప్పటికీ బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కొంత పరిస్థితి మెరుగ్గా ఉంది" అని వివరించారు. మొత్తంగా చూస్తే ఆధునిక జి -20 దేశాల కంటే మెరుగ్గా అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలే ఉద్యోగాలను సృష్టించడంలో ముందంజలో ఉన్నాయని నిగెల్ తెలిపారు.