: సెంచరీ కొట్టిన సీఎం కేసీఆర్ పాలన


ఎన్నో ఆశలు, సరికొత్త ఆలోచనలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలిసారి పాలన బాధ్యత వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని వర్గాల వారికీ న్యాయం చేసే విధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రైతులకు రుణ మాఫీ, పేదలకు రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం, క్రీడాకారులకు ప్రోత్సాహక చర్యలు, ఆడపిల్లల వివాహానికి కల్యాణ లక్ష్మి అమలు, మైనార్టీలకు వివాహ సమయంలో రూ.51 వేల ఆర్థిక సాయం, బతుకమ్మ, బోనాలు పండుగలను అధికారికంగా నిర్వహించడం, మరమగ్గాల కార్మికులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ, ఆటో రిక్షాలపై రవాణా పన్ను రద్దు, తెలంగాణ జిల్లాల్లో గత సంవత్సరంలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ... ఇలా పలు సంక్షేమ నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో కొన్ని అమలు చేయగా, మరికొన్ని అమలయ్యే దశలో ఉన్నాయి. ప్రధానంగా మన వూరు- మన ప్రణాళిక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి కావాల్సిన పనులకు బడ్జెట్ కేటాయింపులు చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్య ప్రధానంగా ఎదురైంది. దాంతో, పలుచోట్ల రైతులు తీవ్ర నిరసనలకు దిగారు. అటు హైదరాబాదుకు ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంపై ప్రముఖంగా దృష్టి పెట్టారు. ఇటు పెట్టుబడుల కోసం పరిశ్రమలను ఆకర్షించేందుకు సింగపూర్ తరహా 'సింగిల్ విండో' విధానాన్ని కూడా సీఎం పరిశీలించారు. విద్యార్థుల ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ విషయంలో కొంతకాలం జాప్యం, ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంలో 1956 స్థానికతను తెరపైకి తీసుకురావడం, హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల పేరిట పలు భవనాలను కూల్చి వేయడం వంటి అంశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పురిగొల్పాయి. ప్రతి విషయంలో, కదలికలో తన ముద్ర వేస్తున్న కేసీఆర్ వందరోజుల పాలన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చందంగా మారిందని చెప్పుకోవచ్చు.

  • Loading...

More Telugu News