: అలా చేస్తే మోడీ మెడలో హారం వేస్తా: ములాయం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెగువకు పరీక్ష పెడుతున్నారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్. చైనా, పాకిస్థాన్ అధీనంలో ఉన్న మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటే, తాను మోడీ మెడలో హారం వేస్తానని ములాయం అన్నారు. మాయిన్పురి లోక్ సభ స్థానం ఉపఎన్నిక సందర్భంగా ఇటావాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. "పాకిస్థాన్, చైనా దేశాలు ఆక్రమించిన మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోగలిగితే మోడీని అభినందించడమే కాదు, మెడలో హారం కూడా వేస్తాను" అని పేర్కొన్నారు. ఆ రెండు దేశాలతో సత్సంబంధాలకు మోడీ ప్రయత్నించడాన్ని హర్షిస్తూనే, చైనా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ములాయం హెచ్చరించారు. "చైనా ఈ ప్రపంచంలోనే అతి పెద్ద చీటర్. 'హిందీ-చీనీ భాయి భాయి' అన్న నెహ్రూకే ద్రోహం తలపెట్టారు. ఆ షాక్ తోనే నెహ్రూ మరణించారు. అలాంటి చైనాతో సంబంధాలు పెంపొందించుకోవడంలో మోడీ విజయవంతం అవ్వకపోవచ్చు" అని వివరించారు.