: ఆ 46 బొగ్గు గనులపై కేంద్రానికి ఎందుకంత మమకారం!


కోల్ గేట్ కుంభకోణంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించనుంది. గతంలో జరిగిన 218 బొగ్గు గనుల కేటాయింపులు అక్రమమేనని తేల్చిన సుప్రీం... వాటిని రద్దు చేయాలా? కొనసాగించాలా? అన్న విషయంపై నేడు తీర్పు చెప్పనుంది. గనుల కొనసాగింపు, రద్దు విషయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేసిన కేంద్రం, తాజాగా తన వాదనకూ కాస్త మద్దతివ్వాలంటూ కాళ్లబేరానికి వస్తోంది. 218 బొగ్గు గనుల్లో ఓ 46 కేటాయింపులను మాత్రం రద్దు చేయవద్దంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఆ 46లో 40 గనులు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించగా, మరో ఆరు ఈ ఏడాది ఉత్పత్తిని ఆరంభించనున్నాయి. దీంతో వీటిని రద్దు చేయడం వల్ల దేశంలో విద్యుదుత్పత్తికి విఘాతం కలుగుతుందని కేంద్రం వాదిస్తోంది. అంతేకాక ఆయా బొగ్గు గనులను దక్కించుకున్న కంపెనీలు వాటిపై భారీ పెట్టుబడులు పెట్టాయని, గనులు రద్దైతే, సదరు కంపెనీలు పెద్ద ఎత్తున నష్టాలను చవి చూడాల్సి వస్తుందని చెబుతోంది. అయితే కేంద్రం అభ్యర్థన వెనుక మరో కోణం ఉందని, ఈ విషయంపై పిటిషన్ వేసిన సుదీప్ శ్రీవాస్తవ ఆరోపిస్తున్నారు. 40 బొగ్గు గనులను దక్కించుకుని ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీలు, ఆయా బొగ్గు గనులపై పెట్టిన పెట్టుబడిని ఎప్పుడో రాబట్టేసుకున్నాయని ఆయన ఆధారాలతో వెల్లడిస్తున్నారు. భారీ లాభాలు ఆర్జించి పెడుతున్న గనులను వదులుకునేందుకు సిద్ధంగా లేని సదరు కంపెనీలు కేంద్రం చేత కొత్త వాదనకు తెర తీసేలా వ్యవహరిస్తున్నాయని చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడికి ఏడు రెట్ల మేర లాభాలను సదరు కంపెనీలు మూటగట్టుకున్నాయని చెబుతున్న ఆయన వాదన, కేంద్రం వాదనను తిప్పికొడుతుందో, లేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

  • Loading...

More Telugu News