: మొబైల్ వ్యసనమే ఆమె ప్రాణాలు తీసేసింది!
సరదాగా ప్రారంభమైన మొబైల్ వ్యసనం, ఆ మహిళను అంతిమ లోకాలకు చేర్చింది. ప్రేమ వివాహం చేసుకున్న భర్తే, ఆమెను హత్య చేసేలా ప్రోత్సహించింది. చిన్నగా మొదలైన ఆ వ్యసనం ఆ మహిళను భర్తకు ఎదురు తిరిగేలా చేసింది. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేలానూ చేసింది. దీంతో అసహనానికి గురైన భర్త, ఆమె పీకను కత్తితో కోసి హతమార్చాడు. బెంగళూరు నగరంలోని రాజగోపాల నగర పరిధిలోని సంజీవిని నగరలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇరుగుపొరుగు ఇళ్లల్లో నివసించే రేణుక, సైమన్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సంజీవిని నగరలో కాపురం పెట్టారు. సైమన్ ఓ కంపెనీలో పనికి కుదిరాడు. ఈ క్రమంలో చిన్నగా అలవాటైన మొబైల్ వ్యసనానికి రేణు బానిసగా మారింది. నిత్యం మొబైల్ లోనే మాట్లాడుతూ గడిపేది. దీంతో పలుమార్లు సైమన్ హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. డ్యూటీలో ఉన్న సమయంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా, రేణుక సెల్ ఎంగేజ్ లోనే ఉంటుండటం సైమన్ లో అనుమానాన్ని పెంచింది. గొడవలు మరింత ముదిరాయి. మొబైల్ లేకుండా ఊహించుకోవడం కష్టసాధ్యంగా భావించిన రేణుక నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య నిర్లక్ష్య సమాధానంతో విచక్షణ కోల్పోయిన సైమన్ కత్తితో ఆమె పీకను కోసేశాడు. అనంతరం రేణుకను రక్తపు మడుగులో చూసి భయంతో పరారయ్యాడు. బంధువుల ఇంటిలో తలదాచుకున్న సైమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.