: ఇక పెప్పర్ బుల్లెట్లతో ఆందోళనకారుల పనిపట్టనున్న బీహార్ పోలీసులు!


అనుకున్నట్టుగా జరిగితే, త్వరలోనే బీహార్ పోలీసులకు పెప్పర్ బుల్లెట్లు అందుబాటులోకి రానున్నాయి. పెప్పర్ బుల్లెట్లతో పాటు పెల్లెట్ తరహా బుల్లెట్లను కూడా వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, ఇటీవలి కాలంలో నిలువరించేందుకు వీలు కాని రీతిలో మారిపోయాయని చెబుతున్న బీహర్ పోలీసులు, పలు సందర్భాల్లో ఆందోళనకారులపై కాల్పులు జరపాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలు కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఆందోళనకారులు చనిపోతుండటంతో తమపై విమర్శల జడివాన తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళలను అడ్డుకోక తప్పడం లేదు, అలాగని ఆందోళనకారులపై కాల్పులు జరిపితే, విమర్శలనూ ఎదుర్కోక తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మధ్యేమార్గంగా ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు రాష్ట్ర డీజీపీ ఠాకూర్ చెబుతున్నారు. ‘ఇదేమీ కొత్త పద్ధతి కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహాలోనే పెప్పర్, పెల్లెట్ బుల్లెట్లను వాడుతున్నారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో వారిని గాయాలపాల్జేయకుండానే సమర్థవంతంగా కట్టడి చేసేందుకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాక కేంద్రం అనుమతి వస్తే, దేశంలోనే తొలిసారి పెప్పర్ బుల్లెట్లను వాడే రాష్ట్రంగా బీహార్ చరిత్ర సృష్టించనుంది’ అని ఆయన వెల్లడించారు. గుంపుగా వచ్చే ఆందోళనకారులపై పెప్పర్ బుల్లెట్ల ప్రయోగంతో ఒక్కసారిగా ఆందోళనకారుల కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయమని, దీంతో వారు వెనుదిరగక తప్పదని ఠాకూర్ తెలిపారు. ఇక పెల్లెట్ బుల్లెట్లు, చర్మం లోపల నుంచి నొప్పిని పుట్టిస్తాయనీ, దాంతో ఆందోళనకారులు పరుగులు తీయాల్సిందేనని బీహార్ పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News