: బీజేపీ నేత ఆదిత్యనాథ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్, మరోమారు తన మాటల తూటాలను పేల్చారు. ఉత్తరప్రదేశ్ లో ఓ వర్గం జనాభా చాలా రెట్లు పెరిగిపోయిందన్న ఆయన, సదరు వర్గానికి అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఆర్థిక దన్నును అందిస్తోందని విరుచుకుపడ్డారు. ఈ నెల 13న జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం నోయిడాలో పర్యటించిన ఆదిత్యనాథ్, బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన యూపీలోని పశ్చిమ భాగంలో 450 సార్లు మత కలహాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. యూపీ తూర్పు భాగంలో ఇలాంటి ఘర్షణలు ఎందుకు చోటుచేసుకోవడం లేదని ప్రశ్నించిన ఆదిత్యనాథ్, పెరిగిపోతున్న ఓ వర్గం జనాభానే ఈ ఘర్షణలకు కారణమన్న రీతిలో విమర్శలు గుప్పించారు. సదరు వర్గానికి అఖిలేశ్ ప్రభుత్వం ఇతోధికంగా ఆర్థిక దన్నును అందిస్తోందని వ్యాఖ్యానించారు. ఆ వర్గానికి కేటాయిస్తున్న నిధులను రాష్ట్రం విద్యుత్ రంగానికి కేటాయిస్తే, రాష్ట్రంలో విద్యుత్ కోతలకు చెక్ పడుతుందని చెప్పారు. అంతటితో ఆగని ఆదిత్యనాథ్, తూర్పు యూపీలోని హిందువులపై దాడులు జరిగితే, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.