: హైదరాబాద్ లో వినాయక నిమజ్జన కోలాహలం ప్రారంభం
గణనాథుని నిమజ్జన కోలాహలంతో హైదరాబాద్ నగరం మారుమోగుతోంది. శనివారం సాయంత్రం నుంచే మొదలైన నిమజ్జన ప్రక్రియ ఆదివారం మరింత ఊపందుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెలసిన విఘ్ననాథుడి ప్రతిమలు హుస్సేన్ సాగర్ వైపు చిన్నచిన్నగా అడుగులు వేస్తున్నాయి. ఇక హైదరాబాద్ కే కాక యావత్తు దేశానికే తలమానికమైన ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం సోమవారం ప్రారంభం కానుంది. నిమజ్జనానికి ఒక్కరోజే సమయం ఉండటంతో ఆదివారం ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన భక్తుల కోలాహలం సాయంత్రానికి కూడా ఏమాత్రం తగ్గలేదు. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల నుంచి గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివెళుతుండటంతో భారీ సందడి నెలకొంది. డప్పు వాయిద్యాలు, టపాసుల మోతలతో నగరం మారుమోగుతోంది. మరో రెండు రోజుల పాటు నగరం గణేశ్ నిమజ్జనం సందడిలో మునిగిపోనుంది.