: భయపడకండి...మేమున్నాం: కాశ్మీర్ వరద బాధితులకు ఒమర్ అబ్దుల్లా భరోసా
కాశ్మీర్ వరద బాధితులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ధైర్యం నూరిపోస్తున్నారు. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో జమ్మూ, కాశ్మీర్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఉపద్రవం కారణంగా ఇప్పటికే 160 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని దాదాపు 2,500 గ్రామాల ప్రజలు వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తుండగా, 450 గ్రామాలు పూర్తిగా నీటిలో ముగినిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయానక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారిలో ధైర్యం నూరిపోసేందుకు ఒమర్ అబ్దుల్లా రంగంలోకి దిగారు. ‘‘ఇదంతా అనుకోని ఉపద్రవమే. దీని నుంచి బయటపడేందుకు శాయశక్తులా శ్రమిస్తున్నాం. మీరు ఏ మాత్రం భయపడొద్దు. అతి త్వరలోనే మేము మీ వద్దకు చేరుకుంటాం’’ అంటూ ప్రకటించారు. వరద జలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు వైమానిక దళ హెలికాఫ్టర్లను రంగంలోకి దించమని కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు.