: భారత్ కు మరో ముప్పు పొంచి ఉందా?
భారతదేశానికి మరో 26/11 లాంటి ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో అత్యయికపరిస్థితి వస్తే ప్రాణాలకు తెగించి పోరాడే పోలీసులు లేరని కూడా ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరిస్తోంది. ఆల్ ఖైదా భారత్ శాఖను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రటించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. భారత్ లో పెరుగుతున్న జనసాంద్రత, నిఘావ్యవస్థ లోపాలు ఉగ్రదాడిని బలపరుస్తున్నాయి. మన పోలీసుల మానసిక స్థైర్యంపై అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి పేరిట వేసిన వలకు పతంగ్ కుమార్ ఏమారినట్టు పోలీసులను ఏమార్చడం పెద్ద కష్టమేం కాదని నిపుణులు చెబుతున్నారు. ఉగ్రదాడులు తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికే జరుగుతాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. దేశంలో వేళ్లూనుకున్న అవినీతి, మత మౌఢ్యం మాటున దాడులు జరగడం పెద్ద కష్టం కాదని, డబ్బు ఎర వేస్తే ఉగ్రవాదులకు ఇక్కడి వారే సహకారం అందించే ప్రమాదం ఉందని నిఘావర్గాలు ఆనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఆల్ ఖైదా ఉనికిలేదు. దాని ఉనికిని చాటుకునేందుకు, ఐఎస్ఐఎస్ ఆసియాలో తన ప్రాబల్యం ప్రదర్శించేందుకు ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.