: ఈ ఆడిటర్ ఘనుడు... బతికుండీ మరణించినట్టు రికార్డులు సృష్టించాడు


విజయవాడకు చెందిన ఆడిటర్ నాదెళ్ల శ్రీనివాసరావు మహా ఘనుడు. కోర్టు విచారణ తప్పించుకునేందుకు తాను మరణించినట్టు రికార్డులు సృష్టించి, కోర్టును మోసగించేందుకు ప్రయత్నించి, ఆదాయ పన్ను శాఖకు బుక్కయ్యాడు. విజయవాడకు చెందిన నాదెళ్ల శ్రీనివాసరావు ఆడిటర్ గా పని చేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లిస్తానని చెప్పి పలువురు కస్టమర్ల నుంచి పది లక్షల రూపాయలకు పైగా వసూలు చేసి, స్వాహా చేసేశాడు. ఆదాయ పన్ను చెల్లించినట్టు వారికి నకిలీ రసీదులు ఇచ్చేశాడు. ఐటీ శాఖ అతని మోసం గుర్తించి, ఐటీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. దీంతో ఈ కేసును నాంపల్లిలోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు విచారిస్తోంది. రెండు పర్యాయాలు కోర్టు విచారణకు హాజరైన నాదెళ్ల శ్రీనివాస్ తర్వాత కనిపించలేదు. శ్రీనివాసరావు మృతి చెందినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసు విచారణను మూసివేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనుమానం వచ్చిన ఐటీ శాఖ న్యాయవాది విచారణకు కొంత గడువు కావాలని కోర్టును కోరారు. తరువాత విజయవాడలో విచారించగా, గుర్తు తెలియని శవాన్ని ఖననం చేసి, శ్మశాన వాటిక నుంచి శ్రీనివాసరావు చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు తీసుకున్నట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు నిర్థారించారు. ఐటీ శాఖ ఇచ్చిన సమాచారంతో అతనిని పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ఈ నెల 18 వరకు అతనికి రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News