: సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదులు ఇలా గాలమేస్తారు!
హైదరాబాద్ యువతను ఐఎస్‌ఐ ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా ఆకర్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. వాట్సప్, ఫేస్‌బుక్‌ల సాయంతో అమాయక యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదులుగా మారుస్తారు. హైదరాబాదుకు చెందిన యువతను ముందుగా ఢిల్లీకి పిలిపించుకుని అక్కడి నుంచి కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్ సరిహద్దులు దాటిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉగ్రవాదులుగా మారేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా పట్టణాల్లోని పేదకుటుంబాలకు చెందిన యువతనే వీరు లక్ష్యం చేసుకున్నారు. వీరి ఆర్థిక అసమానతను సొమ్ము చేసుకుంటున్న ఉగ్రవాద సంస్థలు ఆర్థికంగా ఆదుకుంటామని, తాము చేసేది పవిత్ర యుద్ధమని మత విశ్వాసాల నడుము వారిని జీహాద్ కు సిద్ధం చేస్తున్నారు. తాజాగా హైదరాబాదుకు చెందిన నలుగురు యువకులు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుపడిన సంగతి తెలిసిందే. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. కాగా, ఇంకో 15 మంది ఐఎస్ఐఎస్ లో చేరేందుకు దేశం దాటినట్టు సమాచారం. దీంతో పాతబస్తీలో అదృశ్యమైన యువతపై దృష్టిపెట్టారు. తమ పిల్లలు ఎవరైనా తప్పిపోయినట్టు తల్లిదండ్రులు భావిస్తే వారిపై తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాదులో ఉగ్రవాదం పట్ల ఆకర్షితమవుతున్న యువత, గతంలో ఉగ్రవాదులుగా పట్టుబడి జైళ్ల నుంచి విడుదలైన వారిపై పోలీసులు నిఘా పెట్టారు.