: మోడీ 'టీచర్స్ డే' సందేశం 'ఫుల్ టెక్ట్స్' ఇదిగో
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు వారి విద్యార్థుల ఆలోచనా పరిధిని 'దిజ్మండలం' (భూమ్యాకాశాలు కలిసినట్టు కనిపించే రేఖామాత్ర ప్రాంతం) ఆవలకు తీసుకెళ్ళాలని అభిలషించారు. టీచర్లు పట్టుదల, చిత్తశుద్ధితో జాతి భవితను రూపుదిద్దేందుకు సాయపడాలని ఆకాంక్షించారు. ఇంకా అనేక అంశాలపై ప్రధాని తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆయన సందేశం పూర్తిపాఠం ఇదిగో... ప్రియమైన భారత ఉపాధ్యాయులారా, టీచర్స్ డే సందర్భంగా యావత్ ఉపాధ్యాయ సమాజానికి నా శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు కూడా ఆయన జన్మదినోత్సం సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. ఈ శుభసందర్భంలో ఈ సందేశం ఇవ్వడాన్ని మహదవకాశంగా భావిస్తున్నాను. అనాదిగా, వ్యక్తులను శక్తులుగా మార్చడంలో, మన సమాజంలో గురువులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మన సంస్కృతిలో బోధన అనేది అన్నిట్లానే ఓ వృత్తి కాదు, అదో పవిత్రమైన బాధ్యత. వ్యక్తులకు దిశానిర్దేశం చేయడం, జీవితాలను తీర్చిదిద్దడం అందులో భాగం. అందుకే ఇలా చెబుతారు.... గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః.. అని. ఒకప్పుడు భారత్ ను 'విశ్వగురు' అని పిలిచేవారు. మరోసారి భారత్ కు ఆ గౌరవం దక్కలా మీరు కృషి చేయాలి. మనదేశం మళ్ళీ ప్రపంచానికి దారిచూపే దిక్సూచిలా అవతరించాలి. భారత్ ఇప్పుడు మార్పు దిశగా పయనిస్తోంది. ఈ కష్టసాధ్యమైన ప్రయాణంలో మీ పట్టుదల, చిత్తశుద్ధి జాతి నిర్మాణానికి ఉపయోగపడాలి. జాతి భవితను రూపుదిద్దడంలో మీ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి విద్యార్థిని చూసి అతని టీచర్, ప్రతి టీచర్ ను చూసి వారి విద్యార్థులు గర్వపడే రోజును చూడాలని కోరుకుంటున్నాను. విద్యార్థులపై మీరు చూపే ప్రభావం, మీరు వారికి పంచే అనుభవాలు జీవితాంతం వారితోనే ఉంటాయి. మీరు సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తున్నారు, ఇటుకలు పేరుస్తున్నారు. ఇదో మహోన్నతమైన బాధ్యత. దీనిపైనే వర్తమాన, భవిష్యత్ తరాల వృద్ధి ఆధారపడి ఉంది. ఈ టీచర్స్ డే నాడు ఓ ఆలోచనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేర్చుకోవడమనే ప్రక్రియను... సమాచార సేకరణ, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, ఉద్యోగాలు, వృత్తులకు సంబంధించి అత్యంత ప్రధానమని భావిస్తున్నారు. నేనూ అలాగే భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమిటంటే... మీ విద్యార్థుల ఆలోచనా పరిధిని విస్తృతం చేయండి. వారి జ్ఞానాని దిజ్మండలం ఆవలకు తీసుకెళ్ళండి. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపైకి వారి దృష్టిని మళ్ళించండి. గతాన్ని గౌరవించే, భవితను సృష్టించే పౌరుల్లా విద్యార్థులను మలచండి. బాల్యంలో వినే పాఠాలు... మెరుగైన సమాజ రూపకల్పన దిశగా వారితో సుదీర్ఝంగా ప్రయాణిస్తాయి. పరిశుభ్రత, స్త్రీపురుష వివక్ష చూపకపోవడం, బలహీనుల పట్ల ఆపేక్ష, పెద్దల యందు భక్తి... ఇలాంటి సమాజం రావాలి. ఈ ప్రయాణం కూడా ట్రాఫిక్ రూల్సులానే చాలా సామాన్యంగా ఉండాలి. ఈ టీచర్స్ డే నాడు ఆ ప్రస్థానం ఆరంభమవ్వాలి, అందుకు, మీ సహకారం కావాలి. మనం ఈ కర్తవ్యం పట్ల పునరంకితమవుదాం. ఎంతో ఆశాభావం, ఆత్మవిశ్వాసం తోడుగా... మీకు నా వందనాలు. తస్మై శ్రీ గురవేనమః. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను. మీ నరేంద్ర మోడీ