: కనీసం ఒక్క పిరియడ్ లో అయినా జీవితానికి అవసరమైన విద్య నేర్పండి: ఉపాధ్యాయులకు మోడీ సూచన
అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేయాలని ఆలోచించే వారేనని ప్రధాని నరేంద్ర మోడీ విద్యావ్యవస్థ పనితీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రతి టీచర్ రోజులో ఒక్క పిరియడ్ అయినా పిల్లలు భవిష్యత్ లో ఎలా మసలుకోవాలి? ఎలాంటి జీవిత విధానం అవలంబించాలి? అనేది నేర్పితే ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దిన వారవుతారని అన్నారు. వస్త్ర విధానంలోను, హెయిర్ స్టైల్ లోను పిల్లలు తమ టీచర్లను అనుకరించడం సర్వసాధారణమని ఆయన తెలిపారు. విద్యార్థులకు మరుగుదొడ్లు లేవనే దుస్థితి పోవాలని ఆయన ఆకాంక్షించారు. జపాన్ లాగే మన ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలసి పనిచేసే విధానం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. చరిత్ర చదవడం వల్ల మన ముందు తరాలు ఎలాంటి పరిస్థితులు అనుభవించారు, మనం ఎలా ఉండాలి, ప్రపంచం ఎలా మారింది... వంటి విషయాలు బోధపడతాయని ఆయన తెలిపారు. దురదృష్టవశాత్తు, గూగుల్ అనేది మన విద్యార్థులకు ఇప్పుడు టీచర్ గా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లంటే 'ఇలా చేయకండి, అలా చేయండి' అని చెప్పేవారే కాదని, జీవన విధానాన్ని మెరుగుపరిచేవారని ఆయన తెలిపారు.