: ఐపీఎల్ పై బోథమ్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన బీసీసీఐ
ఐపీఎల్ ను ఎత్తేయాలంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ భోథమ్ వ్యాఖ్యానించడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ పై ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని బోర్డు హితవు పలికింది. వారి ఆటగాళ్ళను ఐపీఎల్ లో ఆడేందుకు అనుమతిస్తున్నందుకు గాను, ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు తాము భారీగా ముట్టజెపుతున్నామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఆయా దేశాల బోర్డులకు రూ.60 కోట్ల వరకు చెల్లిస్తున్నామని వివరించారు. అంతకుముందు, ఐపీఎల్ పై బోథమ్ వ్యాఖ్యానిస్తూ, ఆటగాళ్ళు ఈ లీగ్ కు బానిసలవుతున్నారని, క్రికెట్ నాణ్యత తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు. "బోర్డులకు పైసా కూడా విదల్చకుండా, ఆయా దేశాల అత్యుత్తమ ఆటగాళ్ళను రెణ్నెల్ల పాటు ఈ లీగ్ లో ఎలా ఆడిస్తారు?" అంటూ ప్రశ్నించాడు. క్రికెట్ ఆట దీర్ఘకాలిక శ్రేయస్సు రీత్యా ఐపీఎల్ కొనసాగింపు మంచిదికాదని ఈ ఇంగ్లండ్ దిగ్గజం అభిప్రాయపడ్డాడు.