: సమగ్ర సర్వేతో జీహెచ్ఎంసీకి రూ. 500 కోట్ల అదనపు ఆదాయం
తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా జీహెచ్ఎంసీ ఖజానాకు ఏడాదికి రూ. 500 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. వాస్తవానికి ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 13 లక్షల 58 వేల మంది మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల 22 లక్షల కుటుంబాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నట్టు తేలింది. అంటే అదనంగా మరో 8.3 లక్షల కుటుంబాలు వచ్చినట్లైంది. ఇందులో ఆస్తిపన్ను చెల్లించాల్సిన కుటుంబాల సంఖ్య ఎంత తక్కువ వేసుకున్నా 5 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకారం, జీహెచ్ఎంసీకి అదనంగా ఆస్తి పన్ను వసూళ్లు మరో రూ. 500 కోట్లు పెరుగుతాయని అధికారులు అంటున్నారు. దీనికోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను విభాగం కసరత్తు ప్రారంభించింది.