: సద్గురువయితే రాయి సైతం నేర్చుకోలేని విద్య లేదు: సీఎం కేసీఆర్
గురువు సద్గురువు అయితే రాయి సైతం నేర్చుకోలేని విద్య అంటూ ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అమ్మ జన్మనిస్తే... గురువు జీవితాన్ని ఇస్తాడని... తమను గొప్పగా తీర్చిదిద్దిన ఘనత వారిదేనని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాదు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. అదే సమయంలో తనకు చిన్నతనంలో విద్య నేర్పిన గురువు మృత్యుంజయ శర్మను కేసీఆర్ తలచుకున్నారు. ప్రస్తుతం తాను ఇలా నాలుగు మాటలు మాట్లాడుతున్నానంటే తన గురువు పెట్టిన అక్షరభిక్షేనని చెప్పారు. ఎలాంటి ఫీజులు తీసుకోకుండానే తమకు గురువు చదువు చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాను తొమ్మిదో తరగతిలోనే పద్యం రాశానని, అది తన గురువు దయ అని సీఎం వివరించారు.