: కప్ ఎవరిదో చెప్పారు, కారు గెలుచుకున్నారు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ఉంటున్న ఇద్దరు భారతీయులు ఫిఫా వరల్డ్ కప్ పై నిర్వహించిన కాంపిటీషన్ లో లగ్జరీ కారు గెలుచుకున్నారు. కేరళకు చెందిన ఇస్మాయిల్ పాలప్పడం, బషీర్ ఇద్దరూ రూమ్మేట్లు. ఇస్మాయిల్ ఫొటోగ్రాఫర్ కాగా, బషీర్ ఓ డెలివరీ సంస్థలో డ్రైవర్. ఇద్దరూ కలిసి అల్ అయిన్ లో ఓ ఫొటో స్టూడియో నడుపుతున్నారు. వీరికి సాకర్ పై ఆసక్తి మెండు. దీంతో, ఇటీవలే ముగిసిన ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలో పాల్గొన్నారు. టోర్నీ ఫైనల్ సహా ఇతర మ్యాచ్ ల ఫలితాలను కరెక్టుగా ఊహించిన వారికి హ్యుండాయ్ జెనెసిస్ కారును బహుమతిగా ప్రకటించారు. వీరిద్దరూ ఊహించిన ఫలితాలు సరిగ్గా సరిపోలాయి. దీంతో, ఈ కేరళ జాతీయులను విజేతలుగా ప్రకటించి కారు తాళాలు అందించారు. తమకు బహుమతిగా దక్కిన కార్లను అమ్మేసి, ఆ డబ్బును తమ వ్యాపారంలో పెట్టాలన్నది మిత్రులిద్దరి యోచన. అందులో కొంత సొమ్ము వినియోగించి, తన భార్యబిడ్డలను కేరళ నుంచి యూఏఈ రప్పించుకోవాలని బషీర్ భావిస్తున్నాడు.