: భారత్ ను వేధిస్తున్న క్యాన్సర్ స్పెషలిస్టుల కొరత


భారత్ లో ప్రతి ఏడాది క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న రోగుల సంఖ్య భారీగానే ఉంటోంది. దేశంలో ప్రస్తుతం 5,22,164 మంది పురుషులు, 5,64,619 మంది స్త్రీలు క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక చెబుతోంది. 2020నాటికి ఈ సంఖ్య మరింత పెరగుతుందన్న అంచనాల నేపథ్యంలో, కేంద్రం చెబుతున్న వాస్తవాలు నివ్వెరపరచకమానవు. దేశంలో సగటున ప్రతి 2,500 మంది క్యాన్సర్ పేషెంట్లకు కేవలం ఒక్క డాక్టరే ఉన్నాడట. దేశం మొత్తం మీద క్యాన్సర్ స్పెషలిస్టుల సంఖ్య 1600 మాత్రమేనట. క్యాన్సర్ విషయంలో వైద్యుడు, రోగుల నిష్పత్తి దారుణంగా పడిపోవడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్ లో ప్రముఖ ఆంకాలజిస్టుగా పేరొందిన డాక్టర్ ఎస్.హెచ్.అద్వానీ రోజుకు 80 నుంచి 100 మంది క్యాన్సర్ పేషెంట్లను చూస్తారట. అదే, అమెరికాలో క్యాన్సర్ నిపుణులు రోజుకు 10 మంది కంటే ఎక్కువ మందిని చూడరు. దీన్నిబట్టే అర్థమవుతోంది, భారత్ లో క్యాన్సర్ స్పెషలిస్టుల కొరత ఏ స్థాయిలో ఉందో. మనదేశంలో ప్రతి ఏడాది 15 మంది సర్జికల్ క్యాన్సర్ స్పెషలిస్టులు, 25 మంది మెడిసిన్ ఆంకాలజిస్టులు కొత్తగా వైద్య వృత్తిలోకి వస్తున్నారు. అయితే, ఈ సంఖ్యకు మూడింతల మంది క్యాన్సర్ స్పెషలిస్టులు అవసరమని నిపుణులు అంటున్నారు. దేశంలో ప్రస్తుతం 15 ప్రభుత్వ క్యాన్సర్ సెంటర్లు మాత్రమే ఉండగా, త్వరలో మరో 20 సెంటర్లను ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది.

  • Loading...

More Telugu News