: వాష్ రూమ్ కు వెళ్లడానికి కూడా జగన్ కు అంతమంది తోడెందుకు?: యనమల
గురువారం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలతో అప్పటి వరకు ఫుల్ సీరియస్ గా సాగిన సభ... ఒక్కసారిగా నవ్వుల పర్యంతమైంది. వివరాల్లోకి వెళితే... నిన్న రాజధాని అంశంపై సభ్యులు మాట్లాడుతుండగానే ప్రతిపక్ష నాయకుడు జగన్ సభ నుంచి బయటకు వెళ్లారు. జగన్ సీటు నుంచి లేవగానే... మరికొంతమంది సభ్యులు లేచి ఆయనకు తోడుగా వెళ్లారు. ఈ సమయంలో యనమల లేచి నిలబడి "అధ్యక్షా... ఇంత ముఖ్యమైన చర్చ జరుగుతుండగా ఏ విధమైన సూచనలు ఇవ్వకుండా ప్రతిపక్ష నేత చల్లగా జారుకుంటే ఎలా... మళ్లీ సభకు వస్తారో రారో చెప్పాలి" అని సూచించారు. కొంచెం సమయం గడిచిన తర్వాత జగన్ మళ్లీ సభ లోపలికి వచ్చారు. యనమల చేసిన వ్యాఖ్యల గురించి రోజా వైఎస్ జగన్ కు చెప్పారు. దీంతో వైఎస్ జగన్ రెండు చేతులు జోడించి యనమలకు నమస్కరించారు. వెంటనే మైకు తీసుకుని... "వాష్ రూమ్ కు వెళ్లినా రాజకీయం చేస్తే ఎలా అధ్యక్షా? ప్రతీ దానికీ అభాండాలు మోపడమేనా? ఇంతగా దిగజారి రాజకీయాలు చేస్తారా?" అని యనమలను ఉద్దేశించి అన్నారు. దీనిపై యనమల మరోసారి తనదైన శైలిలో సెటైర్ వేశారు. "నా వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సభకు వచ్చినందుకు సంతోషం...వాష్ రూమ్ కు వెళ్లడానికి కూడా జగన్ కు అంతమంది తోడెందుకు?" అని అనడంతో సభలో నవ్వులు విరిశాయి.