: రజనీ అభిమానుల జాబితాలో విదేశీ క్రికెటర్


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల జాబితా చాలా పెద్దదే. తాజాగా ఈ జాబితాలో కివీస్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ కూడా చేరాడు. సాధారణంగా క్రికెట్ స్టార్లకు విశ్వవ్యాప్తంగా అభిమానులుంటారు. టేలర్ లాంటి క్రికెటర్లకైతే చెప్పాల్సిన పనే లేదు. సొగసైన అతడి ఆటతీరుకు ప్రత్యర్థి జట్టు సభ్యులు కూడా సలాం చేస్తారు. అలాంటి క్రికెట్ స్టార్, రజనీ చిత్రానికి తొలి రోజు తొలి ఆటకే టికెట్ తీసుకుంటాడట. అంతేకాదండోయ్, ఆ రోజు రజనీ సినిమా చూడటం తప్ప వేరే వ్యాపకాలేవి కూడా పెట్టుకోడట. భారత క్రికెటర్లకైతే, రజనీ ఫాలోయింగ్ ఏమిటో తెలుసు. మరి విదేశీ క్రికెట్ వీరుడు రాస్ టేలర్ ను రజనీ ఎలా ఆకర్షించాడనేగా అనుమానం. అదంతా ఐపీఎల్ పుణ్యమే. ఎందుకంటే, ఐపీఎల్ లో రాస్ టేలర్, చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్నాడు కదా. అలా రజనీ అభిమానిగా మారాడు. రజనీ కొత్త చిత్రం 'లింగా' పోస్టర్లపై భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యకు టేలర్ స్పందించాడు. లింగా చిత్రాన్ని విడుదలైన రోజు తొలి ఆటకే చూడాలనుకుంటున్నానని, ఆ రోజు మరే వ్యాపకం కూడా పెట్టుకోవడం లేదని రజనీపై తన అభిమానాన్ని టేలర్ చాటుకున్నాడు.

  • Loading...

More Telugu News