: క్రికెటర్లు ఐపీఎల్ కు బానిసలవుతున్నారు: బోథమ్
ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై వ్యాఖ్యానించారు. ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ అతి శక్తిమంతంగా కనిపిస్తోందని అన్నారు. ఆటగాళ్ళు దానికి బానిసలయ్యారని విమర్శించారు. క్రికెట్ దీర్ఘకాలిక శ్రేయస్సు దృష్ట్యా ఈ టోర్నీని తొలగించడమే మంచిదని ఈ దిగ్గజ క్రికెటర్ సూచించారు. ఈ లీగ్ కారణంగా ప్రపంచ క్రికెట్ ప్రాధామ్యాలే మారిపోయాయని పేర్కొన్నారు. ఐపీఎల్... బెట్టింగ్ తో పాటు ఫిక్సింగ్ కు తగిన వేదికగా నిలిచే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఫిక్సింగ్ గురించి మాట్లాడుతూ, ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఈ సమస్య మూలాలను వెతికిపట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫిక్సింగ్ వెనకున్న పెద్దతలల పేర్లు బయటపెట్టాలని అన్నారు.