: మతం మారు, స్వర్గానికి వెళతావు: లంక ఓపెనర్ కు పాక్ క్రికెటర్ సలహా
పాకిస్థాన్ వంటి దేశాల్లో మతమౌఢ్యం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదో చక్కని ఉదాహరణ. ఇటీవలే శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య దంబుల్లాలో శనివారం వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ళు డ్రెస్సింగ్ రూంకు మరలుతుండగా... పాక్ క్రికెటర్ అహ్మది షేజాద్ లంక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ తో ముచ్చటించాడు. "నువ్వు ముస్లింవి కాదా? అయితే, ముస్లింగా మారిపో. నేరుగా స్వర్గానికి చేరతావు" అంటూ సలహా ఇచ్చాడు. ఇది కాస్తా బౌండరీ వద్ద ఉన్న మైక్రోఫోన్లలో రికార్డయింది. దిల్షాన్ ఏమని బదులిచ్చాడన్నది మాత్రం రికార్డు కాలేదు. దీనిపై, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. షేజాద్ కు సమన్లు జారీ చేసింది. అతని వ్యాఖ్యలపై వివరణ కోరింది.