: దేశవ్యాప్తంగా గుజరాత్ తరహా విద్యా విధానం!
గుజరాత్ విద్యా విధానం ఇకపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాల్లో అమలులోకి రానుంది. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర విద్యా విధానంలో శాల ఉత్సవ్, శాల దర్పన్, వాంచే గుజరాత్ తదితర ప్రత్యేక కార్యక్రమాలను పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాలు అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా బాగా ఆకట్టుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ పకడ్బందీగా తయారైంది. తాజాగా ఈ విధానాలను దేశంలోని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ ఆదేశాలతో అధికారులు ఇప్పటికే ఈ విషయంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. పాఠశాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఏటా క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా పాఠశాలలోని వసతులు, సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అధికారులు, రాజకీయ నేతల దృష్టిలో పడే అవకాశాలున్నాయని, తద్వారా మరింత మెరుగైన వాతావరణం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాక, పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత స్థితికి చేరిన వారిని ఆహ్వానించి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం కూడా విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన 'వాంఛే గుజరాత్' మంచి ఫలితాలిచ్చింది. దీనిని వాంఛే భారత్ పేరిట అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. సమీప భవిష్యత్తులో గుజరాత్ తరహా విద్యా విధానంలోని ఈ కార్యక్రమాలు దేశంలోని అన్ని పాఠశాలల్లో అమలులోకి రానుంది.