: రాయలసీమలో ‘రాజధాని’ ప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన అంశం రాయలసీమలో అగ్గి రాజేసింది. ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా విలసిల్లిన కర్నూలును కాదని విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు వెలువడుతున్న వార్తలపై సీమ విద్యార్థులు భగ్గుమన్నారు. మరోవైపు రాష్ట్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నామన్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. దీంతో బుధవారం సాయంత్రం నుంచే రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో విద్యార్థి సంఘాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వ ప్రకటనపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కర్నూలుకు రాజధాని హోదా దక్కదన్న అంచనాకు వచ్చిన విద్యార్థులు గురువారం జిల్లాల బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో గురువారం ఉదయమే ఆయా జిల్లాల కేంద్రాలతో పాటు ప్రధాన పట్టణాల్లో రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు ప్రజా రవాణా వ్యవస్థను అడ్డుకోవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలను కూడా స్తంభింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు, కడప నగరాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.