: దేశ వైద్య చరిత్రలో అద్భుతం... రోగి క్షేమం


భారతీయ వైద్య చరిత్రలో ఈరోజు ఓ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. వైద్యులు, పోలీసులు, ప్రజల సహకారంతో ఓ వ్యక్తి పునర్జన్మ పొందాడు. శరీరం నుంచి వేరు చేసిన గుండెలో ఆరు గంటల వరకే జీవం ఉంటుంది. గుండె మార్పిడి ఆపరేషన్ నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా జరుగుతుంది. ఆపరేషన్ జరిగినా కొన్ని సందర్భాల్లో రోగి ప్రాణాలతో బతికి బట్టకట్టడం కష్టం. అలాంటి అసాధ్యాన్ని కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల వైద్యులు సుసాధ్యం చేసి చూపించారు. వివరాల్లోకి వెళితే... ముంబైకి చెందిన 42 ఏళ్ల ఓ రోగి గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఎదురు చూస్తున్నాడు. అతనికి గుండె కావాలంటూ చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆసుపత్రి వైద్యులు దేశంలోని పలు ప్రముఖ ఆసుపత్రులకు సమాచారమిచ్చారు. వారం రోజులుగా దాతల కోసం ఎదురుచూసిన చెన్నైలోని మలర్ ఆస్పత్రి వైద్యులకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ గుండెను బాధితునికి ఇచ్చేందుకు ఆమె బంధువులు అంగీకరించారని సమాచారం అందింది. దీంతో మలార్ ఆసుపత్రి వైద్యులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. బెంగళూరులో మహిళ నుంచి గుండెను స్వీకరించిన వైద్యులు ప్రత్యేక విమానంలో చెన్నై తీసుకువచ్చారు. 320 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 40 నిమిషాల్లోనే అధిగమించారు. చెన్నై విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి 12 కిలోమీటర్ల దూరం. రోడ్డు రద్దీగా ఉంటుంది. దీంతో స్థానిక పోలీసులు సహాయం తీసుకుని ట్రాఫిక్ ఆపేశారు. ప్రజలు సహృదయంతో సహకరించడంతో ఈ దూరాన్ని అంబులెన్స్‌ కేవలం 8 నిమిషాల్లో దాటింది. మలార్ ఆసుపత్రిలో సిద్ధంగా ఉన్న వైద్యులు గుండెను బాధితుడికి విజయవంతంగా అమర్చారు. సినీ ఫక్కీలో సాగిన ఈ గుండె ప్రయాణం నిండు ప్రాణాన్ని కాపాడింది. రోగి క్షేమంగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News