: రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ డీటెయిల్స్
వివాదాస్పద ఫిలిం మేకర్ రాంగోపాల్ వర్మ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. 'నా వ్యాఖ్యలు నా ఇష్టం' అన్న రీతిలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని మరోసారి ఘనంగా ఆవిష్కరించుకున్నారు. ఆ ముఖాముఖి వివరాలివిగో... ప్రశ్న: వినాయకుడిపై వ్యాఖ్యలు చేయడం ద్వారా మరోసారి వివాదాల తేనెతుట్టెను కదిలించారు. దీనిపై మీ స్పందన..? వర్మ: అది నా నైజం. నేను లోపల ఏం అనుకుంటానో, అదే చెబుతాను. అలా ఉండడాన్నే ఇష్టపడతాను. నేను ఎంచుకున్న మార్గం అది. ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదే. ఎవరికన్నా ఆసక్తి ఉంటే, నాలుగేళ్ళుగా నేను చేస్తున్న కామెంట్స్ ను పరిశీలించుకోవచ్చు. అన్నీ ఒకేలా ఉన్నాయని వాళ్ళు గుర్తిస్తారు. ప్రశ్న: ప్రజా వ్యతిరేక వ్యాఖ్యలకు గర్విస్తున్నారా? వర్మ: రాంగోపాల్ వర్మ అంటే అదే. మీకు గుర్తుందా..? కొన్నాళ్ళ క్రితం అమితాబ్ బచ్చన్ ను ఉద్దేశిస్తూ ఓ అభ్యంతరక పదాన్ని వాడాను. దానిపై పెను దుమారమే లేచింది. ఆయన తప్ప అందరూ తీవ్రంగా స్పందించారు. వాస్తవానికి నేను అన్న మాటకు బాధపడాల్సింది ఆయన, కానీ, ఆయన తప్ప అందరూ బాధపడ్డారు. నేను ఏ ఉద్దేశంలో ఆ మాట అన్నానో, దాన్ని అమితాబ్ అర్థం చేసుకున్నారు. ప్రశ్న: గణేశుడిపై వ్యాఖ్యల అనంతరం మీకు చావు బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి భయం కలిగిస్తోందా? వర్మ: నాకెలాంటి బెదిరింపులు రాలేదు. సోషల్ మీడియాలో ఎవరో, ఎక్కడి నుంచో, ఏవో కామెంట్లు చేస్తారు. అలాంటివాటిని పట్టించుకోను. ప్రశ్న: ప్రజల దృష్టిని మీవైపు మరల్చుకునేందుకే ట్వీట్లు చేస్తారని అందరూ అనుకుంటున్నారు. మీ కామెంట్..? వర్మ: ప్రజలు నేను చెబుతున్నానని కాకుండా, వారు ఏది నమ్మాలనుకుంటారో అదే నమ్ముతారు. అంతే తప్ప, మరోటి కాదు. ప్రశ్న: మీరు మత వ్యతిరేకా? లేక, మనుష్య ద్వేషా? మత విశ్వాసాలపై దాడిని తప్పని భావించడంలేదా? వర్మ: నేను ప్రతిదానికీ వ్యతిరేకం అన్న వాదనను అంగీకరించను. నా అభిప్రాయాలను వెల్లడిస్తానంతే. దాన్ని ఏదో అంశంపైనో, ఎవరిపైనో దాడి అనుకుంటే ఎలా? దేశంలో అందరిలాగే, ఏదైనా చేసే హక్కు నాకూ ఉంది. ప్రశ్న: మీరు గత ఆరు నెలలుగా ముంబయిలో కనిపించడంలేదు. హిందీ సినిమాలు వదిలేసి తెలుగు సినిమాలు మాత్రమే తీయాలనుకుంటున్నారా? వర్మ: హిందీ సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నన్ను నేను పునరావిష్కరించుకునే క్రమంలో భాగంగా కొత్త పంథాలో సినిమాలు తీయాలని తీర్మానించుకున్నాను. ప్రశ్న: మీ ఐస్ క్రీమ్ ఫ్లాప్ అని తెలుస్తోంది. ఆ ఫెయిల్యూర్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఓ పార్టీ కూడా ఇచ్చారట. దీనిపై మీ కామెంట్..? వర్మ: నేను విన్నవాటిలో ఇది అత్యంత తమాషా వార్త. పెట్టుబడికి, రాబడికి మధ్య నిష్పత్తితో పోల్చి చూస్తే 'ఐస్ క్రీమ్' పెద్ద హిట్. ప్రశ్న: మీరు హైదరాబాదులో ఉన్నప్పుడు ముంబయి సినీ స్నేహితులు టచ్ లో ఉంటారా? వర్మ: నాకెవరూ స్నేహితుల్లేరు, ఉండరు కూడా. ప్రశ్న: మీ ధోరణి కారణంగా సినీ పరిశ్రమలో ఏకాకి అయ్యారని భావిస్తున్నారా? వర్మ: నేను నాలాగా ఉండడాన్ని ఇష్టపడతాను. నాకోసం జీవిస్తాను. నా గురించి ఆలోచిస్తూ టైం వేస్టు చేసుకునే ఇతరుల కోసం నేను టైం వేస్టు చేసుకోను.