: నవంబర్ లో సచిన్ జీవితచరిత్ర విడుదల
భారత క్రికెట్ మహోన్నతుడు సచిన్ టెండూల్కర్ స్వీయ జీవితచరిత్ర ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. నవంబర్ 6న ఈ పుస్తకాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ పుస్తకం పేరు 'ప్లేయింగ్ ఇట్ మై వే'. దీన్ని భారత్ లో హచిటే సంస్థ పబ్లిష్ చేయనుండగా, మిగతా దేశాల్లో హాడర్ అండ్ స్టాటన్ సంస్థ పబ్లిష్ చేస్తుంది. ఈ పుస్తకాన్ని సచిన్, క్రికెట్ చరిత్రకారుడు బొరియా మజుందార్ సంయుక్తంగా లిఖించారు. తన పుస్తకం నవంబర్ లో రానున్నట్టు సచిన్ ఈ మేరకు ట్విట్టర్లో తెలిపారు. కెరీర్ లో తానాడిన చివరి ఇన్నింగ్స్ లో సచిన్ 74 పరుగులు చేశాడు. ముంబయి వాంఖెడేలో విండీస్ పై ఆడిన ఆ ఇన్నింగ్స్ లో అవుటై వస్తూ బ్యాట్ పైకెత్తి అందరికీ అభివాదం తెలిపాడు. ఇప్పుడా అభివాదం ఫొటోను ఈ పుస్తకం కవర్ పేజీపై ముద్రించారు.